చిగురుటాకులపై తొలి రవి కిరణం ముద్దు హిమబిందువైన వేళ…
సిగ్గరి నింగి ఎర్రని మబ్బుల ముగ్గులతో ముస్తాబైన క్షణం...
నీ పాదాల పారాణి పరికిణీ అంచులతో దోబూచులాడుతుంటే...
నీ మునివేళ్ళ నుంచి జాలువారుతున్న రంగవల్లి హరివిల్లయ్యే క్షణం...
నీ ముంగురుల చాటునుంచి నీ క్రీగంటి చూపు నను తాకిన క్షణం .... తొలి వలపుల ప్రేమ
తోరణాల పందిరి ముస్తాబుల నడుమ
సన్నాయి మేళాలు, వేద మంత్రాలు, ఆత్మీయుల ఆశీస్సుల సాక్షిగా
నిను నా దానిని చేసుకున్న వేళ...
రాలే తలంబ్రాల చాటు నుంచి నీ చూపులు నను తాకిన క్షణం .... జీవన ప్రయాణానికి నా ప్రమాణం
కోయిలలు కుహూ కుహూ రాగాల జావళీలు పాడగా
సప్త వర్ణాలతో రంగరించిన ప్రకృతి అందాలు కనుల విందు చేయగా
వెన్నెల రాత్రిన చుక్కలు చంద్రునితో సరసమాడే క్షణం
నీ మోము నా చేతుల నడుమ చంద్రబింబమై
నీ బుగ్గల ఎరుపు మెరుపై నను మరిపించగా
మెరిసే నీ పెదవులను ముద్దాడిన నను నీ కొంటె చూపు తాకిన క్షణం ... మధుర ప్రణయం
నా చేతిలో చేయి వేసి సాగించిన ప్రయాణం చివరి మజిలీ
మన ప్రేమ తలపులు కన్నీరై నేల రాలుతున్న క్షణం
మూతపడుతున్న రెప్పల నడుమ నీ చివరి చూపు నను తాకిన క్షణం ... ప్రళయం ... అది నా మరణం
No comments:
Post a Comment